Elections: డిసెంబరు 7న అన్ని సంస్థలకు వేతనంతో కూడిన సెలవు: తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్
- ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలి
- ఆన్‌లైన్ ఓటింగ్‌కు అవకాశం లేదు
- ప్రోత్సాహకాలు ప్రకటించాలి: జయేష్ రంజన్
తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనున్న డిసెంబరు 7న అన్ని కంపెనీలు, సంస్థలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. కాబ్టటి అందరూ విధిగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఐటీ ఉద్యోగులు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని, ఈసారి అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన రజత్ కుమార్ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆన్‌లైన్ ఓటింగుకు అవకాశం లేదని, వీవీపాట్‌ల దుర్వినియోగం అసాధ్యమని తేల్చి చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదన్నారు. ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదిస్తే అడ్రస్ మార్పునకు సహకరిస్తామన్నారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో దాదాపు 7 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, అనుబంధ సంస్థల్లో మరో ఆరు లక్షల మంది, నిర్మాణ రంగంలో మరో 8 లక్షల మంది ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. ఓటు వేసే ఐటీ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇస్తామని, వేయని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తే ఫలితం ఉంటుందని తెలంగాణ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు.