kcr: కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు: రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
- టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటానన్నారు
- ఆయన వాస్తవమే చెబుతున్నారు
- ‘తెలంగాణ’ అప్పుల పాలైంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే తాను ఫామ్ హౌన్ లో విశ్రాంతి తీసుకుంటానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు విసిరారు. పరిగిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ వాస్తవమే చెబుతున్నారని, అలా జరిగితే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారని సెటైర్లు విసిరారు.
‘తెలంగాణ’ ఏర్పడప్పుడు మిగులు రాష్ట్రంగా ఉందని, ఇప్పుడు అప్పుల పాలైందని విమర్శించారు. తెలంగాణలో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వాటి గురించి టీఆర్ఎస్ పట్టించుకోలేదని, టీఆర్ఎస్ నాయకులు ఆలయాల భూములను కూడా కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, వారి కష్టాలు తీరేలా సాగునీటి ప్రాజెక్టులు తీసుకువస్తామని, కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకుంటామని, పేదలకు ఇచ్చిన హామీలన్నింటిని తాము నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు.