modi: అక్కడ పెద్ద మోదీ, ఇక్కడ చిన్న మోదీ!: సీఎం చంద్రబాబు సెటైర్

  • దేశాన్ని మోదీ, తెలంగాణను కేసీఆర్ దగా చేస్తున్నారు
  • హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టాను
  • బంగారుగుడ్లు పెట్టే బాతు హైదరాబాద్

అక్కడ పెద్ద మోదీ, ఇక్కడ చిన్న మోదీ అంటూ సీఎం కేసీఆర్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్విన్ కాలనీ జంక్షన్ లో నిర్వహిస్తున్న రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, దేశాన్ని మోదీ దగా చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. నాడు హైదరాబాద్ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని, టీడీపీ విజన్ తోనే హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్పారు.

హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలోకి పెట్టానని, బంగారుబాతు గుడ్లు ఈ నగరం అని, అలాంటి నగరాన్ని ఈరోజున కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీల ప్రకారం డబుల్ బెడ్ రూమ్స్ కట్టాడా? ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. నాడు తాను కష్టపడ్డ ఫలితాలు తెలంగాణ పేదలకు రావాలని, ఆ పేదలకు ఫలితాలు రానప్పుడు తెలంగాణ అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రాజెక్టులకు తాను అడ్డుపడుతున్నానని ఆరోపణలు చేయడం తగదని కేసీఆర్ కు హితవు పలికారు. రేపు కేంద్రంలో రాబోయేది బీజేపీ వ్యతిరేక ప్రభుత్వమని, తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ప్రజాకూటమి తీసుకుంటుందని, ఆ కూటమికి సహకరించే బాధ్యత తాను కూడా తీసుకుంటానని అన్నారు.

తెలంగాణకు ముఖ్యమంత్రిగా తాను రాలేనన్న విషయం కేసీఆర్ కు కూడా తెలుసని, అయినా, తనను విమర్శించాలి కనుక విమర్శిస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News