Chandrababu: నా గురించి నేను ఎన్నడూ భయపడలేదు: చంద్రబాబు నాయుడు

  • దేశ భవిష్యత్తు గురించే నా బాధంతా
  • టీడీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్న మోదీ
  • మీడియాకూ స్వేచ్ఛ లేకుండా పోయింది
  • సంపాదకులతో సమావేశంలో చంద్రబాబు

తనపై కేసులు పెడతారనిగానీ, జైలుకు పంపుతారని గానీ ఎన్నడూ భయపడలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడైనా భయపడ్డానంటే, అది ప్రజల కోసమేనని, సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న నేతలు, కార్యకర్తల కోసమేనని ఆయన అన్నారు.

 ఈ ఉదయం హైదరాబాద్ లో వివిధ పత్రికల సంపాదకులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, తదుపరి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రశ్నే కాదని అన్నారు. మోదీ మినహా మరెవరైనా ఆయన కన్నా మెరుగైన ప్రధానేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలిస్తే, నీటి సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అభివృద్ధి జరిగి తెలంగాణ స్వర్ణ తెలంగాణగా మారాలంటే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

డిసెంబర్ 10న ఢిల్లీలో విపక్షాల ఐక్యతపై కీలక భేటీ జరగనుందని, ఈ భేటీ తరువాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూటమి పోటీపై స్పష్టత రానుందని చంద్రబాబు తెలిపారు. మోదీ, కేసీఆర్ లు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగబోవని ఆయన అన్నారు. అమిత్ షా కుటుంబం ఎంత అవినీతి చేసినా ఐటీ, ఈడీలను ఎందుకు పంపించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఐటీ, ఈడీల దుర్వినియోగం ఏపీలో విపరీతంగా ఉందని, ఇందుకు ప్రధాని కక్షపూరిత రాజకీయా దుశ్చర్యలే కారణమని దుయ్యబట్టారు. తానిప్పుడు దేశ భవిష్యత్ గురించి భయపడుతూనే కాంగ్రెస్ తో కలిశానని చెప్పారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చంద్రబాబు ఆరోపించారు.

  • Loading...

More Telugu News