purandheswari: ఆంధ్రాలో విమర్శలు... తెలంగాణలో ఆలింగనాలా?: కాంగ్రెస్, టీడీపీలపై పురంధేశ్వరి విసుర్లు
- చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై సెటైర్లు
- ప్రజా కూటమి పేరుతో ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారని విమర్శ
- బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు ,
‘ఇదేం రాజకీయం...ఆంధ్రాలో కత్తులు దూసుకుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణకు వచ్చేసరికి పరస్పరం ఆలింగనాలు చేసుకుంటూ రక్తి కట్టిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ తీరును ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారా?’ అని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.
సత్తుపల్లిలో బీజేపీ అభ్యర్థి తరపున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, తెలంగాణలో కలిసి తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తీరును గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆలోచించి ఓటు వేయాలని, బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పథకాలు ప్రకటించడం, హామీలు ఇవ్వడం తప్ప వాస్తవంగా అమలు జరగడం లేదని ఆరోపించారు.