Andhra Pradesh: జగన్ చొక్కాను ఫోరెన్సిక్ పరీక్షలకు ఇవ్వొద్దు.. కోర్టును ఆశ్రయించిన జగన్ న్యాయవాది!
- జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు
- డిసెంబర్ 3కు ఆ పిటిషన్ వాయిదా పడింది
- విశాఖ కోర్టుకు తెలిపిన నీలాపు కాళీదాసురెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ సమర్పించిన చొక్కాను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపరాదని ఆయన న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి విశాఖపట్నం కోర్టును కోరారు. జగన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున, అది తేలేవరకూ వేచిఉండాలని కోరారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు 7వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ నెల 23న జగన్ రక్తపు చొక్కాను ఆయన న్యాయవాదులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ చొక్కాను పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించాలని పోలీసులు మెమో దాఖలు చేశారు.
దీంతో జగన్ న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి కౌంటర్ మెమో దాఖలుచేశారు. జగన్ హైకోర్టులో దాఖలుచేసిన రిట్ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ డిసెంబర్ 3కు వాయిదా పడిందని గుర్తుచేశారు. హైకోర్టులో ఈ వ్యవహారం తేలేవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు.