anjaneya swamy: ‘ఆంజనేయ స్వామి ఓ దళితుడు’ అన్న యూపీ ముఖ్యమంత్రి.. లీగల్ నోటీసు పంపిన హిందూ సంస్థ!
- ఉత్తరప్రదేశ్ సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు
- హనుమంతుడు అడవిలో జీవించాడని వెల్లడి
- 3 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడు నిరుపేద దళితుడని యోగి వ్యాఖ్యానించడంతో పలువురు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యోగికి సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ సంస్థ లీగల్ నోటీసులు జారీచేసింది. కోట్లాది మంది భక్తులు పూజించే ఆంజనేయ స్వామికి ఓ కులం ఆపాదించడంపై మండిపడింది. ఈ ఘటనకు రాజస్తాన్ లోని ఆళ్వార్ జిల్లా వేదికయింది.
ఆళ్వార్ లోని మాలాఖేడాలో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు.
ఈ నేపథ్యంలో ప్రజలంతా రావణులకు కాకుండా రామభక్తులకే ఓటేయ్యాలి’ అని పిలుపునిచ్చారు. అయితే ఆంజనేయస్వామికి ఓ కులాన్ని ఆపాదించడంపై సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ చీఫ్ సురేశ్ మిశ్రా ఆయనకు లీగల్ నోటీసులు జారీచేశారు. మూడు రోజుల్లోగా భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.