DSC: అభ్యర్థుల విజ్ఞప్తిపై స్పందించిన ప్రభుత్వం...డీఎస్సీ షెడ్యూల్‌లో సమూల మార్పులు
- బుధవారం రాత్రి కొత్త షెడ్యూల్ ప్రకటించిన అధికారులు
- డిసెంబరు 24న ప్రారంభం... జనవరి 30 వరకు కొనసాగింపు
- ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం
డీఎస్సీ అభ్యర్థులకు గొప్ప ఊరట. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ అభ్యర్థుల ఆందోళనకు ప్రభుత్వం తెరదించింది. డీఎస్సీ సవరించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. డిసెంబరు 24న పరీక్షలు ప్రారంభమై జనవరి 30 వరకు కొనసాగనున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే విషయంలో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేశారు. డీఎస్సీ షెడ్యూల్ విషయంలో తొలి నుంచి గందరగోళం నెలకొంది.
తొలుత ఓ షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. పలు కారణాలు చూపుతూ వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడంతో రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే తమ పరీక్ష రెండు వారాలు వాయిదా వేయాలన్న సెకండరీ గ్రేడ్ అభ్యర్థుల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం, స్కూల్ అసిస్టెంట్ (భాషలు), పోస్టుగ్రాడ్యుయేషన్ పరీక్ష రోజున కేంద్రీయ విద్యాలయం పరీక్షలు ఉండడంతో తాజా షెడ్యూల్‌పైనా గందరగోళం నెలకొంది. దీంతో మొత్తం షెడ్యూల్‌ను మార్పుచేసి బుధవారం రాత్రి అధికారులు విడుదల చేశారు.
తాజా షెడ్యూల్ ప్రకారం 27న స్కూలు అసిస్టెంట్ (భాషేతర) పరీక్షలు, 28న స్కూలు అసిస్టెంట్ (భాషలు), 29న పోస్టుగ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ పరీక్ష, డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, వ్యాయామ (పీఈటీ) ఉపాధ్యాయ పరీక్షలు జరుగుతాయి. జనవరి 2న ప్రిన్సిపళ్లు, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ పరీక్ష, 3న భాషాపండితుల పరీక్ష ఉంటుంది. ఇక అత్యంత ప్రధానమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ(ఎస్జీటీ) పరీక్ష జనవరి 18 నుంచి 30 వరకు మొత్తం 13 రోజులపాటు కొనసాగనుంది.