Karnataka: నోరు అదుపులో ఉంచుకో...: కన్నడ హీరో అనిరుధ్ కు సీఎం కుమారస్వామి హెచ్చరిక!
- అంబరీష్ స్మారక స్థూపానికి స్థలం కేటాయించిన కుమారస్వామి
- 'సాహససింహ' విష్ణువర్ధన్ కు గుర్తింపెక్కడంటూ అనిరుథ్ విమర్శలు
- నాడు తాను అధికారంలో లేనని గుర్తు చేసిన కుమారస్వామి
గతవారం మరణించిన కన్నడ నటుడు అంబరీష్, స్మారక స్థూపం కోసం స్థలం కేటాయింపు, 'సాహససింహ'గా పేరున్న విష్ణువర్థన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. విష్ణువర్థన్ మరణించినప్పుడు స్మారకం కోసం ఎటువంటి స్థలాన్నీ కేటాయించకపోవడమే ఇందుకు కారణం. దీనిపై అభిమానులు రగిలిపోతుండగా, విష్ణు అల్లుడు అనిరుధ్ చేసిన వ్యాఖ్యలు సీఎం కుమారస్వామికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రభుత్వానికి మర్యాద లేదని, వెంటనే విష్ణువర్ధన్ స్మారకాన్ని నిర్మించాలని, కుమారస్వామి ఈ విషయంలో ఉదాసీనంగా ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
అనిరుధ్ వ్యాఖ్యలపై మండిపడ్డ కుమారస్వామి, తనకు విష్ణువర్థన్ అంటే చాలా గౌరవమని, ఆయన మరణించినప్పుడు తాను అధికారంలో లేనని గుర్తు చేశారు. నాడు సీఎంగా ఉన్న యడ్యూరప్పను స్మారకం నిర్మించాలని కోరానని అన్నారు. అనిరుధ్ వ్యాఖ్యలు తనకు బాధను కలిగించాయని, ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాగా, విష్ణువర్ధన్ మరణించి తొమ్మిది సంవత్సరాలు అయినా, ఇప్పటివరకూ ఆయనకు గుర్తుగా ఎటువంటి నిర్మాణమూ చేపట్టలేదన్న సంగతి తెలిసిందే.