Congress: ఏపీలో పొత్తు నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేసిన రాహుల్ గాంధీ

  • ఏపీలో చంద్రబాబు ఎలా అంటే అలా..
  • పెద్దన్న పాత్రను ఆయనకే వదిలేయాలని రాహుల్ నిర్ణయం
  • చంద్రబాబు తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హ్యాపీ

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఏకం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలో ఏం చేయబోతున్నారనే చర్చ సర్వత్ర మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి నడుస్తారా? లేక, ఒంటరిగానే ముందుకెళ్తారా? అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే, ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం ఉందనుకుంటే కలిసి ముందుకెళ్దామని, లేదంటే ఎవరికి వారుగా పోటీ చేద్దామని చంద్రబాబుతో అన్నట్టు సమాచారం.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేసే పనుల్లో బిజీగా ఉన్న చంద్రబాబు ఇప్పటికే వివిధ పార్టీల నేతలను కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ అంటే విముఖత ప్రదర్శించే కొన్ని పార్టీల నేతలతో మాట్లాడి రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను చంద్రబాబు ఇప్పటికే నెత్తిన వేసుకున్నారు. ఇదే నిర్ణయాన్ని కాస్త ముందు తీసుకుని ఉంటే మరింత బాగుండేదని, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్-బీఎస్పీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉండేవి కావని చెబుతున్నారు.

 ఇతర పార్టీల నేతలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగేలా చూసుకున్నారని అంటున్నారు. మరీ ఎక్కువ సీట్లు అడగకుండా పరిమితికి లోబడే సీట్లు తీసుకున్నారని చెబుతున్నారు. సీట్ల సర్దుబాటులో చంద్రబాబు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం పట్ల కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా ఆయన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది.

తెలంగాణ విషయంలో అన్ని నిర్ణయాలు కాంగ్రెస్‌కే వదిలేసిన చంద్రబాబుకే ఏపీలో పెద్దన్న పాత్రను ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న విషయాన్ని ఆయనకే వదిలేయాలని, పొత్తు అనుకుంటే పొత్తు, లేదంటే విడివిడిగానే వెళ్దామని చంద్రబాబు వద్ద రాహుల్ ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News