Chandramukhi: ఆసక్తికరంగా మారిన ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి అదృశ్యం
- ప్రచారం అనంతరం అదృశ్యం
- సెల్‌ఫోన్ స్విచ్చాఫ్
- లాస్ట్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు
గోషా మహల్ నుంచి బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ - బీఎల్ఎఫ్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి అదృశ్యం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు చంద్రముఖి ఏమైందో ఎలా అదృశ్యమైందో తెలియక పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతుంటే.. మరోవైపు ఆమెను రేపు ఉదయం కోర్టులో హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించడంతో సర్వత్రా ఈ అంశంపై ఆసక్తి నెలకొంది.
బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న చంద్రముఖి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరిన అనంతరం అదృశ్యమైంది. ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. ఈ విషయమై ఆమె తల్లి కోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టులో హాజరుపరిచేలా చర్య తీసుకోవాలంటూ నేడు హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీ, బంజారాహిల్స్ స్టేషన్‌హౌజ్ ఆఫీసర్‌కు నోటీసులు జారీచేసింది.
రేపు ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. లాస్ట్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే చంద్రముఖిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. ఆమె నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని.. తననెవరూ గుర్తించకుండా మాస్క్ ధరించిందని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. తన సహచర ట్రాన్స్ జెండర్లతో మాట్లాడిన తరువాతే చంద్రముఖి సెల్ స్విచ్చాఫ్ చేసిందని పోలీసులు వెల్లడించారు.