chandrababu: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన క్రమం ఇదే: చంద్రబాబు
- కేవలం రెండు గంటల్లో అసెంబ్లీని రద్దు చేశారు
- మెదీ డైరెక్షన్ లో ఎన్నికల కమిషన్ పని చేసింది
- బీజేపీ, కేసీఆర్, జగన్.. అందరూ ఒకటే
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన క్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సనత్ నగర్ సభలో వివరించారు. ఆగస్టు 23న అసెంబ్లీ రద్దు గురించి చెప్పారని... అంతకు ముందు కేసీఆర్ సలహాదారుడు రాజీవ్ శర్మ ఢిల్లీకి వెళ్లారని, 24న శాసనసభ సమావేశం పెట్టుకుని అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారని... 26, 27న ఢిల్లీకి వెళ్లి రాజ్ నాథ్ సింగ్, గడ్కరీలను కలిశారని... 28న గవర్నర్ ను కలిశారని... 30న అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారని... సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన పేరుతో పెద్ద సభ పెట్టారని... సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేశారని చంద్రబాబు వివరించారు.
కేవలం రెండు గంటల్లోనే అసెంబ్లీ రద్దును ఆమోదించారని ఎద్దేవా చేశారు. కుడిచేత్తో గవర్నర్ కు కేబినెట్ తీర్మానాన్ని ఇస్తే.. ఎడమ చేత్తో అప్పటికప్పుడే అసెంబ్లీ రద్దు అయినట్టు ఆయన ప్రకటించారని చెప్పారు. 7వ తేదీన ఎన్నికల కమిషన్ ప్రకటనను విడుదల చేసిందని, మరుసటి రోజే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని అన్నారు. మోదీ డైరెక్షన్ మేరకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఒకవైపు కేసీఆర్, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు జగన్... అందరూ ఒకటేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దేశంలో ఒకవైపు బీజేపీ ఫ్రంట్, మరోవైపు నాన్ బీజేపీ ఫ్రంట్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. బీజేపీ ఫ్రంట్ లో కేసీఆర్ ఉన్నారో, లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ఒకరిని మరొకరు విమర్శించుకుంటున్నట్టు నాటకాలాడుతున్నారని, ఇదే సమయంలో ఎంఐఎంతో కలసి కూడా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఇదెక్కడి న్యాయమో తనకు అర్థం కావడం లేదని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల నీటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. దేశంలో సెక్యులరిజం ఉండాలంటే బీజేపీ, టీఆర్ఎస్ లను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించారు.