hyderabad: హైదరాబాదును కులీ కుతుబ్ షా కడితే.. నేను సైబరాబాదును కట్టా: చంద్రబాబు
- మీ ఉత్సాహం చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
- హైదరాబాదులో నేను ఎన్నో తీసుకొచ్చా
- కేసీఆర్ వల్ల మెట్రో రైలు ఆలస్యమైంది
మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మళ్లీ తనకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీ అభిమానం చూస్తుంటే మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకం కలుగుతోందని చెప్పారు. హైదరాబాదులో వందల సార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. హైదరాబాదును కులీకుతుబ్ షా కట్టారని... హైదరాబాదును తాను కట్టానని ఎప్పుడూ చెప్పలేదని, తాను సైబరాబాదును కట్టానని చెప్పారు.
ఐటీ కారిడార్, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్, శిల్పారామం, శిల్పకళావేదిక, విమానాశ్రయం, రింగ్ రోడ్డు, గచ్చిబౌలి స్టేడియం, మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్ అన్నీ తానే తీసుకొచ్చానని చెప్పారు. అనేక ఐటీ కంపెనీలు తన హయాంలోనే వచ్చాయని చెప్పారు. మెట్రోరైలు పూర్తయ్యే సమయంలో కాంగ్రెస్ పోయి కేసీఆర్ వచ్చారని... ఆయన వల్లే మెట్రో రైలు ఆలస్యమయిందని విమర్శించారు. హైదరాబాద్ సనత్ నగర్ లో మాట్లాడుతూ చంద్రబాబు పైవ్యాఖ్యలు చేశారు.