Kodangal: 40 ఏళ్ల క్రితం ఇందిర... ఇప్పుడు రాహుల్ గాంధీ: రేవంత్ రెడ్డి

  • 40 ఏళ్ల తరువాత కోస్గికి కాంగ్రెస్ అధ్యక్షుడు
  • ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాకూటమిదే విజయం
  • కేసీఆర్ కుటుంబ పాలనకు విముక్తి పలకాలి
  • కొడంగల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి

1978వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఇందిరాగాంధీ కోస్గి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఆ తరువాత 40 సంవత్సరాలకు అదే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈ ప్రాంతానికి రావడంతో కోస్గి పులకిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ 175 స్థానాల్లో విజయం సాధించిందని, ఈ దఫా కూడా అటువంటి విజయం ఖాయమని ఆయన అంచనా వేశారు.

ఈ మధ్యాహ్నం కోస్గిలో రాహుల్ గాంధీతో కలసి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజా కూటమి విజయం ఖాయమని, కేసీఆర్ కు భంగపాటు తప్పదని ఆయన అన్నారు. రాహుల్ రాకతో మన గెలుపు ఖాయమైందని రేవంత్ వ్యాఖ్యానించారు.

తొమ్మిది సంవత్సరాల క్రితం తనకు ఇక్కడ అడ్రస్ కూడా లేదని, బీ-ఫామ్ తీసుకుని వచ్చి నామినేషన్ వేస్తే, 7 వేల మెజారిటీతో గెలిపించిన ప్రజలను తాను ఎన్నడూ మరువబోనని, అప్పటి నుంచి తాను ప్రజా సేవలోనే ఉన్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో తనను 15 వేల మెజారిటీతో ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలని, ఈ ఎన్నికల్లో మరింత మెజారిటీ ఇవ్వాలని కోరారు.

కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా ప్రజా కూటమి ఏర్పడిందని, గుర్తు చేసిన ఆయన, ఈ రాష్ట్రంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసే సమయం ఎంతో దూరంలో లేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు, అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. తనపై కక్ష కట్టిన కేసీఆర్, నాలుగేళ్ల వ్యవధిలో ఎన్నో కేసులు పెట్టించారని, జైలుకు పంపించారని ఆరోపించిన ఆయన, కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలిపేంత వరకూ పోరాటం చేస్తానని అన్నారు.

Kodangal
Rahul Gandhi
Revanth Reddy
Kosgi
Telangana
kcr
  • Loading...

More Telugu News