Rajinikanth: వివాదంలో రజనీకాంత్ ‘2.0’.. సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ టెలికం ఆపరేటర్ల ఫిర్యాదు

  • ఈ సినిమా వల్ల సైన్స్‌పై నమ్మకం పోతుంది
  • సెల్‌ఫోన్లు అత్యంత ప్రమాదకరమని చూపించారు
  • సినిమా విడుదలను అడ్డుకోండి

శుక్రవారం విడుదల కాబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘2.0’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా సైన్స్‌కు విరుద్ధంగా ఉందని, సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ టెలికం ఆపరేటర్లు సీబీఎఫ్‌సీ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ల ఉపయోగంపై ఈ సినిమాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల హాని జరుగుతుందని, సెల్‌ఫోన్లు, మొబైల్ టవర్లు జంతుజాలానికి హానికరమని, పశుపక్ష్యాదులు, మానవుల జీవనానికి ప్రమాదకరమని సినిమాలో చూపించారని, వీటివల్ల ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ఉద్గారాలు వెలువడతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. సెల్‌ఫోన్ల వల్ల హాని జరుగుతుందని శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొంది.

కాబట్టి సైన్స్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని, సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని సీవోఏఐ తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది.  సీబీఎఫ్‌సీకి, కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చే వరకు సినిమా ప్రదర్శనను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి తాము ఫిర్యాదు చేసిన మాట నిజమేనని  సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News