manmohan singh: మోదీ గారూ, అభ్యంతరకర భాషను వాడుతున్నారు.. నిగ్రహం నేర్చుకోండి: మన్మోహన్ సింగ్
- అభ్యంతరకర భాషకు మోదీ దూరంగా ఉండాలి
- బీజేపీయేతర సీఎంలతో కూడా సంయమనంతో వ్యవహరించాలి
- యూపీఏ హయాంలో తాము బీజేపీ పాలిత రాష్ట్రాలపై పక్షపాతం చూపలేదు
ఒక ప్రధానమంత్రిగా మోదీ అందరికీ ఆదర్శంగా నిలవాల్సి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. నిగ్రహాన్ని అలవరుచుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ముఖ్యమంత్రులతో మోదీ ప్రవర్తన చక్కగా ఉంటుందని... బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆయన సంయమనం కోల్పోతున్నారని విమర్శించారు.
తమ సొంత ముఖ్యమంత్రుల మాదిరే ఇతర సీఎంలతో కూడా ప్రధాని సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ఇప్పుడు వాడుతున్న అభ్యంతరకర భాషకు మోదీ దూరంగా ఉండాలని చెప్పారు. యూపీయే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలపై తాము పక్షపాతం చూపలేదని... సాక్షాత్తు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఈ విషయం అడిగితే చెబుతారని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ రచించిన 'ఫేబుల్స్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ టైమ్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.