modi: కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదు: మోదీ
- తెలంగాణను ఓ కుటుంబం నాలుగున్నరేళ్లుగా కబ్జా చేసింది
- రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
- తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను ఇచ్చింది
తెలంగాణ పాలకులు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ, కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదని అన్నారు. దేశాన్ని ఓ కుటుంబం దశాబ్దాలుగా కబ్జా చేస్తే... తెలంగాణను ఒక కుటుంబం నాలుగున్నరేళ్లుగా కబ్జా చేసిందని విమర్శించారు. తెలంగాణలో ఈ దుస్థితి రావడానికి కారణమైన కాంగ్రెస్, టీఆర్ఎస్ లను ప్రజలు నిలదీయాలని అన్నారు. కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న పాలమూరు ప్రాంతంలో నీరు లేక వలసలు పోతున్నారని... ఈ ప్రాంతాన్ని వలసల ప్రాంతంలా మార్చివేశారని చెప్పారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ లబ్ధి పొందిందని... టీఆర్ఎస్ పార్టీ దాన్ని మించిపోయిందని మండిపడ్డారు.
బీజేపీ హయాంలో ఏర్పడిన రాష్ట్రాలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే... తెలంగాణలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను ఇచ్చిందని చెప్పారు. పాలమూరు అంటే పాలు, నీళ్లు అనే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు.