kcr: కేసీఆర్ పైనే పోటీ చేస్తావురా? అంటూ బెదిరించారు.. ఇల్లు చిందరవందర చేశారు: ఒంటేరు ప్రతాప్ రెడ్డి
- నాలుగున్నరేళ్లలో నాపై 23 కేసులు పెట్టారు
- పోలీస్ వ్యవస్థ కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా పని చేస్తోంది
- ప్రతి గ్రామంలో టెంట్లు వేసి మద్యం పంపిణీ చేస్తున్నారు
గత నాలుగున్నరేళ్లలో తనపై 23 కేసులను ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టించారని గజ్వేల్ లో ఆయనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి మండిపడ్డారు. మల్లన్నసాగర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే... ఫైరింగ్ చేయడమే కాకుండా, 42 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. ఆమధ్య ఇద్దరు ఎస్సైలు సూసైడ్ చేసుకున్నార వార్తలొస్తే... అవి సూసైడ్ లు కాదని హత్యలని తాను అన్నందుకు... వాటిపై కూడా కేసులు పెట్టారని చెప్పారు. ఇలాంటి ఎన్నో దారుణాలు జరిగాయని తెలిపారు.
రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ కేసీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా పని చేస్తోందని ఒంటేరు ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గత 45 రోజులుగా హరీష్ రావు ప్రతి గ్రామంలో టెంట్లు వేసి మద్యం పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీడియోలు చూపించినా పట్టించుకోలేదని చెప్పారు. ఈ అన్యాయాలను నిరసిస్తూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట తాను నిరాహారదీక్షకు దిగితే... పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారని మండిపడ్డారు.
తన నివాసంలో సోదాలు చేస్తున్నామంటూ ఇల్లంతా చిందరవందర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీదే పోటీ చేస్తావురా? ఎంత ధైర్యంరా నీకు? నీ వెనుక ఎవరున్నార్రా? అంటూ భయానక వాతావరణం సృస్టించారని అన్నారు. తన ఫోన్ ను కేసీఆర్ ప్రతి రోజు ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులలో వచ్చిన కమిషన్లను ఎన్నికల్లో వెదజల్లుతున్నారని అన్నారు.