Nizamabad District: నిజామాబాద్ ను లండన్ గా మార్చావా కేసీఆర్?... నేను ఇప్పుడే చూసొస్తున్నా: నరేంద్ర మోదీ
- ప్రజలు కరెంట్, నీటికి ఇబ్బందులు పడుతున్నారు
- ఓసారి లండన్ ఎలా ఉందో ఐదేళ్లు ఉండి, చూసిరా
- వెనుకబడిన ప్రాంతాలకన్నా వెనకున్న నిజామాబాద్
- బహిరంగ సభలో నరేంద్ర మోదీ
"కేసీఆర్ అంటుంటారు... నేను నిజామాబాద్ ను అభివృద్ధి చేశాను. స్మార్ట్ చేశాను. లండన్ నగరం మాదిరిగా మారుస్తాను అని. కానీ... ఇక్కడ కరెంట్, మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేను ఇప్పుడే హెలికాప్టర్ లో వస్తూ, ఈ చుట్టు పక్కల ప్రాంతాలు ఓసారి చూసి వద్దామని పైలట్ తో చెప్పి మరీ తిరిగొచ్చాను. నాకు ఏమీ కనిపించలేదు. నేను చూసి వచ్చాను. ఇండియాలో అభివృద్ధిలో వెనుకబడివున్నాయన్న ప్రాంతాలతో పోలిస్తే, మరింతగా నిజామాబాద్ పట్టణ పరిసరాలు అధ్వానంగా కనిపించాయి. లండన్ ఎలా ఉందో ఓ ఐదేళ్లు అక్కడ ఉండి చూసిరండి. ఇక చాల్లే ముఖ్యమంత్రి గారూ..." అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.
ఆపై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వారంటే, ఆయన పార్టీ ఎలా ఉందంటే... అన్నీ సగం సగం చేసింది. యోజనా ప్రాజెక్టుల్లో, వాగ్దానాల అమలులో, ఇచ్చిన హామీల్లో ఏదీ పూర్తి చేయలేదు. చివరకు పదవీ కాలాన్ని కూడా మధ్యలోనే ముగించారు" అంటూ సెటైర్లు వేశారు.