Kamal Nath: మోదీజీ.. కనీసం ఒక్కరి పేరు చెప్పండి: కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్
- ‘రైతు బిడ్డ’రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య
- స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్ మాత్రమే
- మోదీ, శివరాజ్‌సింగ్‌లను కడిగిపారేసిన కమల్‌నాథ్
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జాతీయవాదాన్ని ప్రశ్నిస్తున్న ప్రధాని నరేంద్రమోదీపై మధ్యప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) చీఫ్ కమల్ నాథ్ విరుచుకుపడ్డారు. లేనిపోని అభాండాలు వేయడం మాని తొలుత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఒక్క బీజేపీ నేత పేరు చెప్పాలని సవాలు విసిరారు.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత పట్టణమైన చింద్వారాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారితో కేవలం కాంగ్రెస్ మాత్రమే పోరాడిందని కమల్‌నాథ్ గుర్తు చేశారు. ‘‘బీజేపీ నుంచి ఎవరైనా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారేమో తెలుసుకోవాలని ఉంది. కనీసం ఒక్కరి పేరైనా మోదీ చెబితే వినాలని ఉంది’’ అని కమల్ నాథ్ పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి తాను రైతుబిడ్డనని చెప్పుకుంటున్నారు. కానీ ఆఫ్రికాతో సమానంగా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ తన తల్లిని నిందిస్తున్న వారికి రాహుల్ గాంధీ అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల క్రితం చనిపోయిన తన తండ్రిని కూడా రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తులను రాహుల్ రక్షిస్తున్నారని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.