Hyderabad: పోలీసులకు చుక్కలు చూపించేలా ఏర్పాట్లు చేసుకున్న హుక్కా సెంటర్... అయినా వదల్లేదు!
- జూబ్లీహిల్స్ లో హెచ్టీసీ పబ్
- పోలీసులు వెళ్తే తప్పించుకునే ఏర్పాట్లు
- పక్కా ప్లాన్ తో వెళ్లి రైడ్ చేసిన పోలీసులు
అది హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న హెచ్టీసీ (హైదరాబాద్ టైమ్స్ కేఫ్) పబ్. ఇక్కడ చట్ట వ్యతిరేకంగా హుక్కాను సరఫరా చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు, రైడింగ్ కు వెళ్లగా, చుక్కలు కనిపించాయట. మొత్తం నాలుగు అంతస్తులున్న ఈ బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్ లో హుక్కా కేంద్రం ఉంది.
పోలీసులు తనిఖీలకు వస్తున్నారని తెలియగానే, కింద నుంచి పై అంతస్తుకు సంకేతాలు వెళతాయి. వెంటనే, దాదాపు 90 మీటర్ల పొడవైన తాడు ద్వారా హుక్కా సామాగ్రినంతా కిందకు చేరవేరుస్తారు నిర్వాహకులు. అంతేకాదు... పోలీసులు లిఫ్ట్ ఎక్కగానే, దాన్ని ఆపేస్తారు కూడా. తమ సామానంతా వెళ్లిపోయిందని అనుకున్న తరువాతే ఆ లిఫ్ట్ తిరిగి కదులుతుంది.
ఇక ఈ మొత్తం తతంగాన్ని ముందే పసిగట్టి, పక్కా ప్రణాళికతో మెరుపుదాడికి దిగిన పోలీసులు, హుక్కా సెంటర్ నిర్వాహకుల ఆట కట్టించారు. పై నుంచి హుక్కా సామాను కిందకు దింపే తాడును, విలువైన హుక్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. లోపల తాళం వేసివున్న గదిని తెరచి చూడగా, అందులో డబ్బు, హుక్కాకు వినియోగించే పరికరాలు కనిపించాయి. హెచ్టీసీ నిర్వాహకుడు జీషాన్ తప్పించుకున్నాడని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.