East Godavari District: కాంట్రాక్టుల నుంచి జగన్ కు వాటాలు... సక్రమంగా వెళ్లేలా చూస్తున్న చంద్రబాబు: పవన్ కల్యాణ్ సంచలన విమర్శలు

  • తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరంలో బహిరంగ సభ
  • చట్టసభలకు వెళ్లి అవినీతిని నిలదీయలేని జగన్
  • ప్రజలే జనసేన బలమన్న పవన్ కల్యాణ్

ఏపీలో నిర్మితమవుతున్న ప్రతి ప్రాజెక్టులో జగన్ కు కొంత వాటా వెళుతోందని, ఆయనకు చేరాల్సిన వాటా సక్రమంగా చూసే బాధ్యతను స్వయంగా చంద్రబాబునాయుడు పర్యవేక్షిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రజా పోరాటయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరంలో నిన్న రాత్రి జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఇటీవలి కాలంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నానని కొందరు అంటున్నారని గుర్తు చేసిన ఆయన, చట్టసభలకు వెళ్లి, ప్రభుత్వ అవినీతిపై నిలదీయకుంటే ఏం చేయాలో చెప్పాలని కోరారు. ముందు జగన్ ను అసెంబ్లీకి వెళ్లమని చెప్పాలని ప్రజలను కోరారు.

సీఎం పదవి తనకు అలంకారం కాదని, ప్రజలే తన బలమని, జనసేన అధికారంలోకి వస్తే జవాబుదారీ తనాన్ని పెంచుతామని చెప్పారు. వచ్చే ఐదేళ్లూ చంద్రబాబుకు లేదా జగన్ కు అధికారాన్ని ఇస్తే, గోదావరి నదిలో ఇసుక తిన్నెలు కూడా మాయమైపోతాయని మండిపడ్డారు. ఏపీలో లభ్యమవుతున్న గ్యాస్ ను రిలయన్స్ సంస్థ గుజరాత్ కు పట్టుకెళుతోందని, రాష్ట్ర ప్రజలకు వాటా ఇవ్వకుండా ఈ దందాను సాగించుకుంటుంటే, అటు చంద్రబాబుగానీ, ఇటు జగన్ గానీ ధైర్యంగా ప్రశ్నించలేకపోతున్నారని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News