Telangana: అప్పట్లో ‘అన్నా.. నువ్వే సీఎంగా ఉండాలి’ అంటూ కేసీఆర్ మా ఇంటికి వచ్చాడు!: జైపాల్ రెడ్డి
- తెలంగాణ ఏర్పడ్డాక నన్ను కలుసుకున్నారు
- సీఎం పదవిని ఆశగా చూపించారు
- కేసీఆర్ బుద్ధి తెలుసు కాబట్టే నో చెప్పాను
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ రోజు తనను కలుసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ జైపాల్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ‘ఆరోజు కేసీఆర్ నా ఇంటికి వచ్చి అన్నా.. నువ్వు అందరికంటే పెద్దవాడివి. సీనియర్ నాయకుడివి. కాబట్టి నువ్వే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరాడు. కానీ కేసీఆర్ ఎలాంటి జిత్తుల మారి వ్యక్తో నాకు తెలుసు కాబట్టే.. ఆనాడు ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాను’ అని జైపాల్ రెడ్డి తెలిపారు.
ఇచ్చిన మాటపై నిలబడే అలవాటు కేసీఆర్ కు లేదని జైపాల్ రెడ్డి విమర్శించారు. ఆయన మాటల మనిషి కాదనీ, మూటల మనిషి మాత్రమేనని ఎద్దేవా చేశారు. జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.