Telangana: రెండేళ్లుగా కేటీఆర్ అపాయింట్ మెంట్ నాకు దొరకలేదు.. అందుకే టీడీపీలో చేరుతున్నా!: బుడాన్ బేగ్

  • సీనియర్లకు పార్టీలో గౌరవం లేదు
  • కేసీఆర్ మోదీ చేతుల్లో కీలుబొమ్మ
  • అమిత్ షాను విమర్శించే ధైర్యం లేదు

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో సీనియర్ నేతలకు గౌరవం లేదని తిరుగుబాటు నేత, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బుడాన్ బేగ్ ఆరోపించారు. కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం తాను 2 సంవత్సరాలు ఆగాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ కబంద హస్తాల్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నానని ప్రకటించారు.

టీఆర్ఎస్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం సడెన్ గా తీసుకున్నది కాదని బుడాన్ బేగ్ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి బీజేపీ, కాంగ్రెస్ లను ఎదుర్కొంటామని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ టీఆర్ఎస్ లో అవి కొరవడ్డాయని దుయ్యబట్టారు. మైనారిటీలను పట్టించుకోకుండా ప్రధాని మోదీకి కేసీఆర్ లొంగిపోయారని వ్యాఖ్యానించారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వబోమని అమిత్ షా తెలంగాణ గడ్డపై ప్రకటిస్తే ఆయన్ను విమర్శించే ధైర్యం కేసీఆర్ చేయలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళతామన్న వార్తల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు తనను సంప్రదించారన్నారు. మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకే తాను తెలుగుదేశంలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఖమ్మంలో ఈ నెల 28న జరిగే సభలో బుడాన్ బేగ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Telangana
Andhra Pradesh
KCR
Telugudesam
KTR
appointment
2 years
TRS
Amit Shah
Narendra Modi
Khammam District
  • Loading...

More Telugu News