CPI chada: నిరుద్యోగులకు రిక్త హస్తం... కేసీఆర్ కుటుంబీకులకు మాత్రం ఉద్యోగాలు!: సీపీఐ
- కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదు
- కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు
- మీట్ ద ప్రెస్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ నిరుద్యోగులకు రిక్తహస్తం మిగిలినా, కేసీఆర్ కుటుంబీకులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకపోవడంతో నాలుగున్నరేళ్ల విలువైన కాలం పాలనలో కొత్తదనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. 69 శాతం రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పిన కేసీఆర్‌కు ఆ తర్వాత ఏమైందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాట మర్చిపోయారా? అని ప్రశ్నించారు. రైతు బంధు పథకం, నిర్బంధ విద్య వంటివి ఒట్టి మాటలుగా మిగిలిపోయాయని విమర్శించారు.