vijayasanthi: కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాల్సిన సమయం ఇదే: సినీనటి విజయశాంతి
- దోపిడీ పాలనకు తెరదించాలంటే ఇదే మార్గం
- దొరగారిని ఫాంహౌస్‌కు పంపి విశ్రాంతి తీసుకోమందామని పిలుపు
- ఎల్బీనగర్లో సుధీర్‌రెడ్డికి మద్దతుగా రోడ్డు షో
దొరల పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఓటర్లంతా చైతన్యవంతులైతే కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపించవచ్చునని మహాకూటమి స్టార్ క్యాంపైనర్, సినీ నటి విజయశాంతి పిలుపునిచ్చారు. ఎల్బీ నగర్ ప్రజాకూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డికి మద్దతుగా వనస్థలిపురం, బీఎన్ రెడ్డినగర్, హస్తినాపురం, లింగోజిగూడ, గడ్డి అన్నారం డివిజన్లలో ఆమె రోడ్డు షోలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజాపాలన కావాలంటే మార్పు అవసరమని, ప్రజాకూటమికి పట్టం కట్టాలని కోరారు. వేల కోట్ల ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరాన్ని డల్లాస్, న్యూయార్క్, సింగ్‌పూర్ చేస్తానంటూ మాయమాటలు చెప్పిన కేసీఆర్ నగరం అభివృద్ధిని గాలికి వదిలేసి అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న ప్రగల్బాలు ఎన్నికల తర్వాత ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కార్యదక్షుడైన సుధీర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. విజయశాంతి రోడ్డు షోకు భారీగా జనం తరలివచ్చారు.