Andhra Pradesh: కేంద్ర మంత్రితో సిఫార్సు చేయించిన ఉద్యోగి.. సస్పెండ్ చేసి షాకిచ్చిన టీటీడీ ఈవో అనిల్ సింఘాల్!
- అనూహ్య నిర్ణయం తీసుకున్న ఈవో
- ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం
- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కొరడా ఝుళిపించారు. తిరుమలలో ఉద్యోగ బదిలీ కోసం ఓ కేంద్ర మంత్రి చేత సిఫార్సు చేయించుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సులు ఇప్పించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సింఘాల్ చర్యతో టీటీడీ ఉద్యోగుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువరాజు తిరుమలలో విధులు నిర్వర్తించాలని కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కేంద్ర మంత్రి చేత సిఫార్సు చేయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. యువరాజ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సులు చేయించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సింఘాల్ స్పష్టం చేశారు.
మరోవైపు ఈవో చర్యపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు చాలామంది ఉద్యోగులు మంత్రుల ద్వారా సిఫార్సులు చేయిస్తూ ఉంటారనీ, కుటుంబం, ఇతర సమస్యల కారణంగా ఇలాంటి విజ్ఞప్తులు చేస్తుంటారని తెలిపారు. ఇలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతమాత్రం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.