Khammam District: ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్.. పార్టీకి రాజీనామా చేయనున్న బుడాన్ బేగ్!
- అధిష్ఠానం వ్యవహారశైలిపై అసంతృప్తి
- కీలక పదవి ఆఫర్ చేసిన మహాకూటమి
- ఖమ్మంలో మైనారిటీ ఓట్లే లక్ష్యంగా పావులు
ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ కు షాక్ తగలనుంది. జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న సీనియర్ నేత బుడాన్ బేగ్ టీఆర్ఎస్ ను వీడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందిన బుడాన్ బేగ్ మైనారిటీ నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న బేగ్ ఈసారి టికెట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
తన వ్యతిరేకులకు పార్టీలో పెద్దపీట వేయడంతో పాటు తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన అలిగినట్లు బేగ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, బుడాన్ బేగ్ పార్టీని వీడనున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనతో పలుమార్లు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయమనీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దని సూచించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకే బేగ్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మహాకూటమి నేతలు బేగ్ తో గతకొంత కాలంగా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జిల్లాలోని 35,000 మైనారిటీ ఓట్లపై బేగ్ ప్రభావం ఉండొచ్చన్న అంచనాతో ఆయనకు కీలక పదవి అప్పగించేందుకు మహాకూటమి నేతలు అంగీకరించారనీ, అందుకే బేగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఖమ్మం జిల్లా వైరాలో బుడాన్ బేగ్ జన్మించారు.1980వ దశకంలో వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళశాల (REC)లో విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపునందుకొని 2010 టీఆర్ఎస్ లో చేరారు. 1984 నుంచి 1988 వరకు రాడికల్ విద్యార్థి సంఘం (RSU) ప్రధాన కార్యదర్శిగానూ బేగ్ పనిచేశారు. 2014లో ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. 2015 నుంచి టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.