Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో కీలకఘట్టం.. నేడు గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పనులకు చంద్రబాబు శ్రీకారం!
- గుంటూరు జిల్లా తుళ్లూరులో శంకుస్థాపన
- ఐదు పంప్ హౌస్ లకు పనులు ప్రారంభం
- గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో ఈ రోజు బిజీబిజీగా గడపనున్నారు. మరికాసేపట్లో జిల్లాలోని నకరికల్లు ప్రాంతానికి చేరుకోనున్న చంద్రబాబు.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు తొలిదశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురం నుంచి నకరికల్లు వరకూ ఐదు పంప్ హౌస్ లను ఏర్పాటు చేయనున్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.6,020 కోట్లు వెచ్చించనుంది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 9.6 లక్షల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ఈ నదుల అనుసంధానాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. సాగర్ కుడికాల్వ నుంచి నీటిని ఎత్తిపోసేలా పంప్ హౌస్ లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుంటూరు, ప్రకాశంలో 80 మండలాల్లో తాగునీరు, సాగునీరును సరఫరా చేయొచ్చు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 7,000 క్యూసెక్కుల నీటిని తోడేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా కొండమోడు-పేరేచర్ల 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులను, రెండు బీసీ సంక్షేమ పాఠశాలలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.