Vishal: గజ తుపానులో నష్టపోయిన గ్రామాన్ని దత్తత తీసుకున్న నటుడు విశాల్
- తంజావూరు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్న విశాల్
- ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న నటుడు
- అభినందిస్తున్న అభిమానులు
తమిళ నటుడు విశాల్ మరోమారు పెద్దమనసు చాటుకున్నాడు. తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘానికి కార్యదర్శిగా ఉన్న విశాల్ గజ తుపాను ధాటికి దెబ్బతిన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. విషయం తెలిసిన అతడి అభిమానులు విశాల్‌ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
ఇటీవల సంభవించిన గజ తుపానుకు తంజావూరు జిల్లాలోని కరగవాయల్ గ్రామం పూర్తిగా దెబ్బతింది. తుపానులో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇదొకటి. విషయం తెలిసిన విశాల్ గ్రామాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు నడుం బిగించాడు. గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా, గజ తుపాను బాధితులకు సూపర్ స్టార్ రజనీకాంత్, కమలహాసన్, విజయ్ తదితరులు అండగా నిలిచారు. ఆర్థిక సాయంతోపాటు బాధితులకు అవసరమైన వస్తువులను పంపారు. గజ తుపాను కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి.