KCR: కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాపరెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష
- అరెస్ట్.. ఆపై విడుదల
- గజ్వేల్‌లో ఉద్రిక్తత
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం ఉదయం ఈఆర్వో కార్యాలయం ఎదుట వంటేరు దీక్షకు దిగారు. సాయంత్రం అరెస్ట్ చేసిన పోలీసులు గంట తర్వాత సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు.
అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీగా తీసుకొస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
వంటేరు ప్రతాప్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వేల్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. అర్ధరాత్రి తర్వాత వంటేరు ఆరోగ్యం కుదుటపడింది. దీంతో వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు.