uddav thakarey: జనాలను వెర్రోళ్లను చేయవద్దు: శివసేనపై ఖర్గే మండిపాటు
- ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటన ఓట్ల గిమ్మిక్కే
- అయోధ్యకు వెళ్లకుండా ఇన్ని రోజులు ఆయనను ఎవరు ఆపారు?
- ఎన్నికల సమయం కావడంతో... ఇప్పుడు అందరూ అయోధ్యకు క్యూ కడుతున్నారు
శివసేన, ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరేలపై లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జునఖర్గే విరుచుకుపడ్డారు. ఓవైపు బీజేపీతో స్నేహంగా ఉంటూనే, మరోవైపు అయోధ్య రామాలయ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటన కేవలం ఓట్ల గిమ్మిక్కే అని ఎద్దేవా చేశారు. నాలుగైదు ఏళ్లుగా ఆయనను అయోధ్యకు వెళ్లకుండా ఎవరైనా ఆపారా? ప్రజలను వెర్రోళ్లను చేయద్దు.. అని అన్నారు. ఎన్నికల సమయం కావడంతో ఇప్పుడు అందరూ అయోధ్యకు క్యూ కడుతున్నారని విమర్శించారు.
సమస్యల్లో ఉన్నప్పుడే ప్రజలు భగవంతుడుని తలచుకుంటారని కన్నడలో ఓ సామెత ఉందని... అదే విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి రాముడు గుర్తుకొస్తాడని ఖర్గే దుయ్యబట్టారు. రెండు రోజుల పర్యటనకు గాను ఉద్ధవ్ థాకరే అయోధ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు శివసేన, వీహెచ్పీలు ఈ రోజు కార్యక్రమాలను నిర్వహించాయి.