Telangana: కేసీఆర్ ఇప్పటివరకూ మా ప్రాంతంలో అడుగుపెట్టలేదు.. ఆయన కంటే ఆంధ్రా ముఖ్యమంత్రులే నయం!: కొండా విశ్వేశ్వరరెడ్డి
- టీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం
- ఉన్న ఉద్యోగ ఖాళీలనే భర్తీ చేయడం లేదు
- ఒక్కొక్కరి నెత్తిపై రూ.61 వేల అప్పు మోపారు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీని ఇటీవల వీడి కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో సాగునీరు తెస్తామన్న కేసీఆర్ ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకంగా పేరు మార్చేశారని దుయ్యబట్టారు. అంతారం చెరువును కడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ అందుకు శంకుస్థాపన కూడా చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొత్త ఉద్యోగాలు సృష్టించలేకపోయిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.
ఆంధ్రా ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ ఆరోపిస్తుంటారనీ, దక్షిణ రంగారెడ్డి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, దివంగత రాజశేఖరరెడ్డి రాత్రి బస చేశారనీ, కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ తమ ప్రాంతంలో అడుగుపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు విలయతాండవం చేస్తోందని దుయ్యబట్టారు. ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు. మైనారిటీలకు నిధులను ఇవ్వకుండా మళ్లించారనీ, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ ను సరిగ్గా అమలు చేయలేదని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు తెలంగాణపై రూ.40,000 కోట్ల తెల్ల ఏనుగును మోపుతున్నారని కేసీఆర్ విమర్శించారని గుర్తుచేశారు. అదే కేసీఆర్ ఇప్పుడు సీఎం కాగానే కొద్దిగా డిజైన్ మార్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.95,000 కోట్లకు తీసుకెళ్లారని దుయ్యబట్టారు. తెలంగాణలో పుట్టిన బిడ్డ నుంచి పండుముసలి వరకూ ఒక్కొక్కరి నెత్తిపై రూ.61,000 అప్పును కేసీఆర్ మోపారన్నారు . ఇంట్లో నలుగురు ఉంటే రెండున్నర లక్షల అప్పు ఉన్నట్లేనని తెలిపారు.
బస్సులో జేబు కొట్టేసిన దొంగ టికెట్ డబ్బులు ఇచ్చినట్లు కేసీఆర్ వ్యవహారశైలి ఉందని వ్యాఖ్యానించారు. తొలి రెండేళ్లు అద్భుతంగా పాలించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ తర్వాత గాడి తప్పిందన్నారు. గొర్రెలు, బర్రెలు, కల్యాణలక్ష్మి వంటి చిన్నచిన్న తాయిలాలు చూపుతూ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ భారీగా రుణభారాన్ని మోపుతున్నారని వ్యాఖ్యానించారు.