Andhra Pradesh: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. అదుపు తప్పి కొండను ఢీకొట్టిన బస్సు!
- డ్రైవర్ సహా 15 మంది ప్రయాణికులకు గాయాలు
- అశ్విని ఆసుపత్రికి తరలించిన అధికారులు
- కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు
తిరుమలకు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు ఈ రోజు ఘాట్ రోడ్డుపై అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న మరికొందరు ప్రయాణికులు వీరిని హుటాహుటిన మరో బస్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తిరుపతి నుంచి తిరుమలకు రెండో ఘాట్ రోడ్డు మీదుగా ఈ రోజు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. లింక్ రోడ్డు మలుపు వద్దకు రాగానే ఈ వాహనం అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న కొండను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇంతలో అటుగా మరో బస్సులో వెళుతున్న ప్రయాణికులు ఈ ప్రమాదాన్ని గమనించి తమ వాహనంలో క్షతగాత్రులను అశ్విని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా? బస్సుకు ఫిట్ నెస్ ఉందా? అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.