VHP: అయోధ్యలో నేడు వీహెచ్‌పీ ధరమ్ సభ.. రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా
- రామ మందిరం నిర్మాణానికి ఆర్డినెన్స్ తేవాలన్న డిమాండ్‌తో సభ
- ఇప్పటికే కుటుంబంతో సహా చేరుకున్న శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే
- భారీగా బలగాలను మోహరించిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం
టెన్షన్...టెన్షన్. ఏం జరుగుతుందో అన్న ఆందోళన...రామ నామ జపంతో దేశం నలుమూల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న జనం...అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని, ఆలయ నిర్మాణానికి కచ్చితమైన తేదీ ప్రకటించాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ అయోధ్యలో నేడు నిర్వహించ తలపెట్టిన ’ధరమ్ సభ‘ ప్రభావం ఇది. దాదాపు రెండు లక్షల మంది వీహెచ్‌పీ, శివసేన కార్యకర్తలు సభకు హాజరుకానున్నారని అంచనా. శివసేన అధినేత ఉధ్దవ్ ఠాక్రే శనివారమే కుటుంబంతో సహా అయోధ్య చేరుకున్నారు. ఆదివారం ఆయన ఆలయాన్ని సందర్శించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా రామాలయం నిర్మాణాన్ని గాలికొదిలేసిందని ఆరోపిస్తున్న వీహెచ్‌పీ మందిరం నిర్మాణం కోసం మోదీ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు నాలుగు దశల ఉద్యమానికి నిర్ణయించింది. తొలి దశలో అయోధ్యలో ధరమ్ సభతోపాటు నాగపూర్, బెంగళూరు తదితర 153 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. రెండో దశలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు విజ్ఞాపన పత్రాలు అందించడం, మూడో దశలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని తలబెట్టింది.
అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 31, ఫిబ్రవరి 1న ప్రయాగలో ధర్మసంసద్ నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని ప్రకటించింది. 1992 తర్వాత ఈ స్థాయిలో వీహెచ్‌పీ ధరమ్ సభ నిర్వహిస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దించింది.
సభకు సన్నాహాల్లో భాగంగా వీహెచ్‌పీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అంతటా బైక్ ర్యాలీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. కాగా, అయోధ్య చేరున్న ఉద్దవ్ ఠాక్రే శనివారం మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా కేంద్రం కుంభకర్ణ నిద్రలో ఉందని, బీజేపీ సర్కారును మేల్కొలిపేందుకే తాను అయోధ్య వచ్చానని ప్రకటించారు.