YSRCP: కోడి కత్తి ఎఫెక్ట్.. జగన్‌కు జడ్‌ప్లస్ భద్రత!
- జగన్ భద్రతను పెంచిన ప్రభుత్వం
- సిబ్బందితో ఎస్పీ సమీక్ష
- అప్రమత్తంగా ఉండాలని సూచన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు భద్రత మరింత పెంచింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జరుగుతున్న జగన్ పాదయాత్ర నేడు శ్రీకాకుళంలో అడుగిడనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు జడ్‌ప్లస్ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, ప్రతిపక్ష నేతగా ఆయనకు జడ్‌ప్లస్ భద్రత కల్పించనున్నారు.
ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 60 మంది ఏఎస్ఐలు, సివిల్ పోలీసులు జగన్‌కు పాదయాత్రలో భద్రత కల్పించనున్నారు. అలాగే, ప్రత్యేక భద్రతలో భాగంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, హోంగార్డులు నిరంతరం రక్షణగా ఉంటారు. జగన్ పాదయాత్రపై శనివారం డీఎస్పీలు, ఆర్మ్‌డ్ రిజర్వు ఫోర్సు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలతో ఎస్పీ త్రివక్రమవర్మ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వవద్దని ఆదేశించారు.