Telangana: డిసెంబర్ 11న తర్వాత రాహుల్ గాంధీ వీణ..చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందే!: కేటీఆర్

  • రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టం చేశాం
  • సీమాంధ్రులను కడుపులో పెట్టి చూసుకున్నాం
  • దమ్ములేనివాళ్లే ఎన్నికల్లో గుంపుగా వస్తున్నారు

తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక శాంతిభద్రతలకు పెద్దపీట వేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను చిన్నప్పుడు హైదరాబాద్  అబిడ్స్ లోని గ్రామర్ స్కూలులో చదువుకున్నాననీ, అప్పట్లో ఏదో ఒక కారణంతో ఏడాదికి వారం రోజులు నగరంలో కర్ఫ్యూ విధించేవారని చెప్పారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ కర్ఫ్యూ విధించిన ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. అలాగే గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత అన్నది లేకుండా చేశామని వ్యాఖ్యానించారు. కూకట్ పల్లిలో ఈ రోజు జరిగిన సీమాంధ్రుల సంఘీభావ సభలో మంత్రి మాట్లాడారు.

2014లో జరిగిన విభజన ప్రాంతాలవారీగానే అనీ, ప్రజల మధ్య కాదని కేటీఆర్ అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కులం, మతం, ప్రాంతం పేరు మీద టీఆర్ఎస్ రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజలపై ఎలాంటి వివక్ష చూపలేదని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ములేనివాళ్లు ఐదుగురు గుంపుగా కలిసి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను బతికున్నప్పుడు ఓ పోటు పొడిచిన చంద్రబాబు తాజాగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మరో పోటు పొడిచారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి రాహుల్ కు శాలువా కప్పి వీణ ఇచ్చారని, ప్రతిగా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడికి ఫీడేల్ అందజేశారని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 11న తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం వీళ్లలో ఒకరు వీణ, మరొకరు ఫిడేల్ వాయించుకోవాల్సిందేనని సెటైర్ విసిరారు. జోగీజోగీ రాసుకుంటే రాలేది బూడిదేనని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News