Rajanna Sircilla District: చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగె శోభకు చేదు అనుభవం.. ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు!
- రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో ఘటన
- గతంలో జరిగిన ప్రమాద ఘటనపై నిలదీసిన స్థానికులు
- అప్పుడు నిందితుడికి వత్తాసు పలికి ఇప్పుడు ఓట్లకోసం ఎలా వచ్చారని నిలదీత
రాజన్నసిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బొడిగె శోభకు ఎన్నికల ప్రచారం సందర్భంగా చేదు అనుభవం ఎదురయింది. మల్కాపూర్ గ్రామస్థులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. గతంలో జరిగిన ఓ సంఘటన సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుపై నిలదీశారు. గత ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన శోభకు ముందస్తు ఎన్నికల్లో ఈసారి కేసీఆర్ టికెట్ నిరాకరించారు.
దీంతో ఆమె పార్టీ ఫిరాయించి బీజేపీ టికెట్‌తో ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మల్కాపూర్ గ్రామానికి వెళ్లిన శోభను గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన కొండయ్య అనే వ్యక్తి గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తిప్పాయపల్లి ఎంపీటీసీ సభ్యురాలు భర్త కారుతో ఢీకొట్టడం వల్ల కొండయ్య చనిపోయాడు. దీంతో న్యాయం కోసం మృతదేహంతో గ్రామస్థులు అప్పట్లో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిన శోభ బాధితుల పక్షాన కాకుండా నిందితుడికి వత్తాసు పలికారన్నది గ్రామస్థుల ఆరోపణ. ఈ అంశంపైనే వారు శోభను తాజాగా నిలదీశారు. అప్పట్లో తమకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని గ్రామానికి ప్రచారానికి వచ్చారని ప్రశ్నించారు. గ్రామంలోకి రావద్దంటూ అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఇరువర్గాలతో మాట్లాడి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.