West Godavari District: ఉండి నియోజకవర్గం టీడీపీలో కలకలం... కాళ్ల జడ్పీటీసీ సభ్యురాలు శ్రీవెంకటరమణ పార్టీకి రాజీనామా
- ఆర్థిక లావాదేవీల కేసులో భర్త అరెస్టుతో మనస్తాపం
- దీని వెనుక జెడ్పీ చైర్మన్ బాపిరాజు హస్తం ఉందని విమర్శ
- రాజకీయంగా అణగదొక్కేందుకు తప్పుడు కేసులని ఆరోపణ
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో కలకలం చెలరేగింది. పార్టీకి చెందిన కాళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీవెంకటరమణ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఆమె భర్తను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మనస్తాపానికి గురైన శ్రీవెంకటరమణ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. పోలీసుల చర్యల వెనుక జెడ్పీ చైర్మన్ బాపిరాజు హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే....అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీవెంకటరమణ, భర్త జయరాజులది కాళ్ల మండలం కలవపూడి మోడీ స్వగ్రామం. జయరాజుది ఆక్వా వ్యాపారం. మొదటి నుంచి కాంగ్రెస్ సానుభూతి పరురాలుగా ఉన్న జయరాజు కుటుంబీకులను 2014లో ఎమ్మెల్యే శివరామరాజు టీడీపీలోకి తీసుకువచ్చారు. అనంతరం శ్రీవెంకటరమణ జెడ్పీటీసీగా పోటీ చేయగా ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీకి వీరి చేరిక అదనపు బలమైంది. గెలిచిన తర్వాత జయరాజు కుటుంబం కొన్నాళ్లు భీమవరంలో ఉండి ఇటీవలే నర్సాపురం వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా శ్రీవెంకటరమణ జనసేనలో చేరనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలను శ్రీవెంకటరమణ దంపతులు ఖండించ లేదు. ఈ నేపథ్యంలో నల్లజర్ల ప్రాంతానికి చెందిన ఓ రైతుకు జయరాజు రూ.6 లక్షలు బకాయిపడ్డారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జయరాజును అదుపులోకి తీసుకోవడంతో శ్రీవెంకటరమణ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తాము సదరు రైతుకు చెల్లించాల్సిన మొత్తం ఎప్పుడో చెల్లించామని, అయినా కేసు పేరు చెప్పి తన భర్తను అరెస్టు చేశారని, దీని వెనుక జెడ్పీ చైర్మన్ బాపిరాజు హస్తం ఉందని జెడ్పీటీసీ ఆరోపించారు.
పార్టీ పెద్దలు కొందరు తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే టీడీపీ వర్గాలు ఈ ఆరోపణలు ఖండించాయి. శ్రీవెంకటరమణ జనసేనలో చేరుతున్నారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం, తదనంతర పరిణామాలతో ఆమె దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని కొట్టిపారేశారు. ’బర్రె శ్రీవెంకటరమణ ఆరోపణల్లో వాస్తవం లేదు. మూడు నెలల నుంచి పార్టీ వీడేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఈ కేసును సాకుగా చూపి పార్టీని వీడాలని చూస్తున్నారు’ అని కాళ్ల మండలం టీడీపీ అధ్యక్షుడు గుండాబత్తుల వెంకటనాగేశ్వరరావు అన్నారు.