Kerala: అయ్యప్ప వద్దకు మహిళలు వెళ్లాల్సిందేనన్న టీచర్ అపర్ణ... అర్ధరాత్రి దాడి!
- మహిళలకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయురాలు
- దాడి చేసిన నిరసనకారులు
- ఇటీవలే క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న అపర్ణ
శబరిమలలోని అయ్యప్పను దర్శించేందుకు మహిళలు వెళ్లాల్సిందేనన్న కేరళకు చెందిన అపర్ణ (39) అనే ఉపాధ్యాయురాలి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇటీవల క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న అపర్ణ, తన 13 ఏళ్ల బిడ్డతో కలసి కోజికోడ్ లో నివాసం ఉంటున్నారు. శబరిమలపై సుప్రీంతీర్పు తరువాత మహిళల ప్రవేశానికి ఆమె బహిరంగంగా మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటిపై దాడికి దిగిన నిరసనకారులు రాళ్లు విసిరారు. ఇంటి కిటికీల అద్దాలను పగులగొట్టారు. కేరళలో మహిళల ఆలయ ప్రవేశానికి మద్దతిచ్చే వారిపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సందీపానందగిరి ఆశ్రమంపైనా హిందూ సంఘాల నిరసనకారులు దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.