sabarimala: 200 ఏళ్ల క్రితమే శబరిమల నియమాలు... బ్రిటిష్ నివేదిక!
- 1820లో నివేదిక తయారు చేసిన బ్రిటీష్ అధికారులు
- 19వ శతాబ్దం తొలినాళ్లలో రెండు భాగాలుగా ముద్రణ
- సంప్రదాయవాదుల వాదానికి మరింత బలం
శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయసున్న మహిళలు ప్రవేశించకుండా 200 సంవత్సరాల క్రితమే నిషేధం ఉందని, అంతకుముందు ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారన్న విషయమై సరైన ఆధారాలు లేవని, 1820లో మద్రాస్ పదాతిదళానికి చెందిన ఉన్నతాధికారులు ట్రావెన్ కోర్, కొచ్చి రాష్ట్రాలపై సర్వే చేసి తయారు చేసిన రిపోర్టులో పేర్కొన్నారు. బెంజమిన్ స్వాయిన్ వార్డ్, పీటర్ ఐర్ కాన్నర్ అనే అధికారులు 1820 నుంచి ఐదేళ్లపాటు శబరిమల విశేషాలను సేకరించి ఈ రిపోర్టును రూపొందించగా, 1893 - 1901 మధ్య కాలంలో దీన్ని రెండు భాగాలుగా మద్రాస్ ప్రభుత్వం ముద్రించింది.
ఇప్పుడీ రిపోర్టు సంప్రదాయవాదులకు వరం కానుంది. శతాబ్దాల సంప్రదాయాన్ని మార్చరాదన్న తమ వాదనను వినిపించేందుకు ఈ రిపోర్టు సహకరిస్తుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. శబరిమలను నాడు 'చౌరీముల్లా' అని పిలిచేవారని, 1820 సమయంలో ఏడాదికి 15 వేల మంది వరకూ భక్తులు ఆలయానికి వస్తుండేవారని తెలిపింది. మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే నియమం అలిఖితమని సదరు బ్రిటీష్ అధికారుల నివేదిక పేర్కొంది. బాలికలు, వృద్ధురాళ్లు ఆలయంలోకి వెళ్లవచ్చని, యుక్త వయసువారు, లైంగిక చర్యలో పాల్గొనే వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశం నిషిద్ధమని తెలిపింది.