Chief Electoral Officer: ఓటరు కార్డుకు రూ.25 కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు: తెలంగాణ ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్
- కొత్త వారికి ఇంటి వద్ద లేదా పోలింగ్ బూత్ వద్ద ఉచితంగా కార్డులు
- పాత కార్డుల వారు మాత్రం కేవలం రూ.25 మాత్రమే చెల్లించాలి
- అదనంగా ఎవరయినా వసూలు చేస్తే 1950 నెంబర్ కి ఫిర్యాదు చేయండి
కొత్తగా ఓటరుగా నమోదయిన వారికి ఇంటి దగ్గర లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమీషనే ఉచితంగా కార్డులు అందజేస్తుందని, పాత కార్డుల వారు మాత్రం కేవలం రూ.25 మాత్రమే చెల్లించి ‘మీసేవ’ లో పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ స్పష్టం చేశారు. ‘మీ సేవ’ లో ఓటరు కార్డుకు రూ.100 వసూలు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందుతున్నాయనీ, ఇది అక్రమ వసూలు అని ఆయన ఒక పత్రికా ప్రకటనలో వివరించారు.
ఓటరుగా లోగడ నమోదయిన వారు ‘మీసేవ’ లో కేవలం రూ.25 మాత్రమే చెల్లిస్తే చాలు. ఇలా రూ.25కు మించి అదనంగా ఎవరయినా వసూలు చేసిన పక్షంలో పూర్తి వివరాలతో 1950 నెంబర్ కి ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన వారికి ఇళ్ల వద్ద ఎపిక్ కార్డులను బూత్ స్థాయి అధికారులు ఉచితంగా అందజేస్తారని ఆయన వివరించారు.