Telangana: కేసీఆర్ కు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలన్న ఉత్తమ్.. ఘాటుగా జవాబిచ్చిన అసదుద్దీన్ ఒవైసీ!
- అమ్ముడుపోయారంటూ ఉత్తమ్ విమర్శలు
- దీటుగా తిప్పికొట్టిన ఏఐఎంఐఎం అధినేత
- కేసీఆర్ హయాంలో మతఘర్షణలు లేవని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీటుగా స్పందించారు. ఈ రోజు ట్విట్టర్ లో అసదుద్దీన్ స్పందిస్తూ..‘ ప్రస్తుతం రాష్ట్రంలో 50,000 ముస్లిం అమ్మాయిలు, అబ్బాయిలు గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
800 మంది మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా ఉపకార వేతనాలు లభించాయి. గత నాలుగున్నరేళ్లలో తెలంగాణలో ఎక్కడా మత ఘర్షణలు లేవు. రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది. మమ్మల్ని డబ్బుతో కొనగలమని మీరు అనుకోవడం ప్రతీ హైదరాబాదీని అవమానించడమే’ అని ట్వీట్ చేశారు.