Yanamala: కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!
- రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు
- 12 నెలల పాటు జీతాలు ఇచ్చేందుకు ఆమోదం
- ఏపీ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఈ రోజు అమరావతిలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ భేటీ అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ కాంట్రాక్టు ఉద్యోగులకు కేవలం 10 నెలలు మాత్రమే వేతనం అందించేవారమని, ఇకపై 12 నెలల పాటు వేతనం అందజేస్తామని వెల్లడించారు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేమని గంటా తేల్చిచెప్పారు. మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు 6 నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగులు ఎవ్వరినీ తొలగించబోమని స్పష్టం చేశారు.
ఈ సిఫార్సులను కేబినెట్ ఆమోదించగానే అమల్లోకి వస్తాయని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే వేతనాలు పెంచామని మంత్రి అన్నారు. ఒప్పంద కార్మికులు, అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు సహా పలువురి నుంచి విస్తృతంగా అభిప్రాయాలను సేకరించి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు.