Telangana: దొంగిలించిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ లో కలిపేరోజులు దగ్గరలోనే ఉన్నాయి!: విజయసాయిరెడ్డి
- లోకేశ్ ఎక్కువ సమయం తండ్రితోనే గడుపుతున్నారు
- బాబు జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని అర్థమయింది
- ఆస్తుల కోసం లోకేశ్ ఆరాటపడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ రోజు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయి, రాహుల్ పాదాల దగ్గర వాలిపోయారని వ్యాఖ్యానించారు. ఆయన తీరు చూస్తుంటే యూటర్న్ అంకుల్ మరో చారిత్రక యూటర్న్ కు సిద్ధపడిపోతున్నట్లు అనిపిస్తోందని తెలిపారు. తాను దొంగిలించిన టీడీపీని రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలో కలిపేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
పప్పు నాయుడు(లోకేశ్) తన తండ్రి నిప్పు నాయుడు(చంద్రబాబు)తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే నిప్పు నాయుడు సంపాదించిన సంపద ఏయే దేశాల్లో, ఏయే బినామీ పేర్లతో నేలమాళిగ వాల్ట్స్ లో ఉన్నాయో కూపీ లాగుతున్నారని చెప్పారు. చంద్రబాబు మానసిక సమస్యతో క్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని లోకేశ్ కు అర్థమయిందని పేర్కొన్నారు. పూర్తిగా మైండ్ పోయి అన్నీ మర్చిపోకముందే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని లోకేశ్ ఆరాటపడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈరోజు ఉదయం ట్విట్టర్ లో స్పందిస్తూ..‘చంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్ అయిపోయి, రాహుల్ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ ‘యూ-టర్న్ అంకుల్’ మరో చారిత్రక ‘యూ టర్న్’కు సిద్ధపడిపోతున్నాడు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలోనే తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.