Onions: కిలో రూపాయికి పడిపోయిన ఉల్లి ధర.. దిక్కు తోచని స్థితిలో రైతులు
- రవాణా చార్జీలు కూడా దక్కే పరిస్థితి లేదు
- మార్కెట్లకు పెద్ద ఎత్తున చేరుకున్న ఉల్లి
- రూపాయికే అమ్ముకుంటున్న రైతులు
ఉల్లిపాయలు కోయకుండానే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో ధర అమాంతం రూపాయికి పడిపోవడంతో కనీసం రవాణా చార్జీలు కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. కర్ణాటక, మహారాష్ట్రల్లోని మార్కెట్లకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉల్లి చేరుకుంది. దీంతో ధరలు అమాంతం పడిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వారం రోజుల క్రితం 100 కేజీల ఉల్లి ధర రూ.500 ఉండగా.. ఆ తరువాత రోజు రూ.200కి పడిపోయింది. తాజాగా రూ.100కు పడిపోయింది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లి పండించే జిల్లాలు బీజాపూర్, బెల్గాం, ధార్వాడ్, చిత్రదుర్గ, బాగల్‌కోట్, గడగ్ తదితర జిల్లాల్లో రైతులు కుదేలవుతున్నారు.
గజ తుపాను కారణంగా ఉల్లి లోడ్‌తో ఉన్న ట్రక్కులు తమిళనాడుకు వెళ్లడం కష్టమవుతోంది. ఉల్లి ట్రక్కులు తమిళనాడుకు వెళ్లేందుకు మరికొన్ని రోజులు పట్టొచ్చని.. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితిలో కిలో రూపాయికే అమ్ముకుంటున్నట్టు రైతులు చెబుతున్నారు.