KTR: అక్రమాలు బయటపడతాయనే చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకున్నారు!: మంత్రి కేటీఆర్
- విభజనకు సైంధవుడిలా చాలాసార్లు అడ్డుపడ్డారు
- ఇప్పుడే విభజనలో కదలిక వచ్చింది
- రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తాం
తన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి హైకోర్టు విభజనను అడ్డుకున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైకోర్టును విభజిస్తామని కేంద్రం చాలాసార్లు చెప్పినా, ఎన్టీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడ్డారని వ్యాఖ్యానించారు. తన పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు పలు కేసుల్లో స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఈ రోజు నిర్వహించిన ‘అడ్వొకేట్స్ ఫర్ టీఆర్‌ఎస్’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత హైకోర్టు విభజన ఫైలులో కదలిక వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి వచ్చే ఏడాది జనవరిలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి టీఆర్ఎస్ ఓ మకుటమనీ, దాని వెనుక అన్నివర్గాల ప్రజలు ఉన్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలందరి తోడ్పాటు లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదన్నారు.
తెలంగాణ వచ్చాక న్యాయవాదుల సంక్షేమంతో పాటు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా వెంటనే ఎదుర్కొన్నామన్నారు. కేసీఆర్ గొప్ప కార్యదక్షుడు, పట్టుదల కలిగిన నాయకుడని కేటీఆర్ కితాబిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీలేని పోరాటం చేశారని మంత్రి అన్నారు. సత్వర న్యాయం కోసం న్యాయ వ్యవస్థలోనూ కొన్నిమార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పేదలకు న్యాయం అందేలా చూస్తామని కేటీఆర్ తెలిపారు.