Telangana: చంద్రబాబు వేసిన శిలాఫలకాలను కృష్ణా నదిలో వేస్తే ఏకంగా డ్యామ్ తయారవుతుంది!: సీఎం కేసీఆర్
- తెలంగాణ దుస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నా
- ఏ ముఖం పెట్టుకుని టీడీపీ ఓట్లడుగుతోంది?
- పాలమూరు ప్రజలు గొర్రెలు కాదు
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు దుస్థితి చూసి తాను చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రొ.జయశంకర్ తో కలిసి తాను తెలంగాణ అంతటా పర్యటించానని గుర్తుచేసుకున్నారు. ఈ మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు 9 సంవత్సరాల పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం, కరీంనగర్ రిజర్వాయర్, పట్టెం, నార్లాపూర్ రిజర్వాయర్లను నిర్మించామని వ్యాఖ్యానించారు. జడ్చర్లలో ఈ రోజు జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు వేసిన శిలాఫలకాలను కృష్ణానదిలో అడ్డం వేస్తే.. ఏకంగా ఓ డ్యామ్ తయారవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలమూరు ప్రాజెక్టు కట్టవద్దని ఢిల్లీకి ఉత్తరాలు రాసిన చంద్రబాబు, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. టీడీపీకి ఓటు వేయడానికి పాలమూరు ప్రజలు గొర్రెలు, అమాయకులు కాదని స్పష్టం చేశారు.
పాలమూరు జిల్లా కష్టాలు ఇప్పుడిప్పుడే తీరుతున్నాయన్నారు. మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టి పోతా! అని చంద్రబాబు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ తరఫున పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కోర్టుల్లో 35 కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునే కుట్ర చేశారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.