Andhra Pradesh: మొహమ్మద్ ప్రవక్త జన్మ దినోత్సవ వేడుకలు.. ట్విట్టర్ లో స్పందించిన జగన్!
- ప్రవక్త బోధనలు శాంతిని పెంపొందిస్తాయి
- సంతోషం, సౌభాగ్యంవైపు నడుపుతాయ్
- క్రీ.శ 570లో మక్కాలో జన్మించిన మొహమ్మద్
ప్రవక్త మొహమ్మద్ జన్మదినోత్సవ వేడుకలు(మిలాద్ ఉన్ నబి) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఈ రోజు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మొహమ్మద్ ప్రవక్త బోధనలు అందరినీ శాంతి, సౌభాగ్యం, సంతోషాలవైపు నడుపుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జగన్ ట్విట్టర్ లో స్పందించారు.
ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం క్రీ.శ 570 రబీవుల్ అవ్వల్ నెల, 12వ తేదీన ఇప్పటి సౌదీ అరేబియాలోని మక్కాలో మొహమ్మద్ ప్రవక్త జన్మించారు. మక్కా పెద్ద, ఖురైష్ తెగకు చెందిన అబ్దుల్ మత్తలిబ్ కు కుమారుడు అబుద్దాలా, అమీనా దంపతులకు ఆయన జన్మించారు. పాఠశాలకు వెళ్లి ఎలాంటి విద్యను మొహమ్మద్ అభ్యసించలేదు.
తన 40వ ఏట ఆయన్ను ప్రవక్త పదవి వరించింది. దేవుడు ఒక్కడేననీ, మనుషులంతా సమానమేనని మొహమ్మద్ ప్రబోధించారు. నిత్యం యుద్ధంలో మునిగితేలుతున్న అరబ్ తెగలను ఏకం చేసి సువిశాల ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.
మొహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా సందర్భంగా రాత్రుళ్లు ఆధ్యాత్మిక సభలు, నాతియాకలామ్ (ప్రవక్త కీర్తనలు) నిర్వహిస్తారు. వేకువ జామున నమాజ్ తర్వాత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు మిలాద్ ఉన్ నబి సందర్భంగా హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.