paruchuri gopalakrishna: ఆ దర్శకుడు నా రెండు చేతులూ పట్టుకుని సారీ చెప్పాడు: పరుచూరి గోపాలకృష్ణ
- 'మరో మలుపు' దర్శకుడిగా వేజెళ్ల
- ఆయన నన్ను డైలాగ్స్ రాయొద్దన్నారు
- మాదాల రంగారావు మెచ్చుకున్నారు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'మరో మలుపు' సినిమాను గురించి ప్రస్తావించారు. " వేజెళ్ల సత్యనారాయణగారు .. 'మరో మలుపు' సినిమాకి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరుగుతోన్న రోజులవి. అన్నయ్య వెంకటేశ్వరరావు ఆ సినిమాకి సంభాషణలు రాస్తున్నారు. అప్పట్లో నేను 'డిటెక్టివ్' కథలు రాస్తుండేవాడిని. వేజెళ్ల సత్యనారాయణగారి దృష్టిలో నేను డిటెక్టివ్ రైటర్ ని.
అన్నయ్య 'మరో మలుపు' సినిమాకి డైలాగ్స్ రాస్తుంటే .. ఆ పక్కనే నేను కూర్చున్నాను. అక్కడికి వచ్చిన వేజెళ్లగారు 'వెంకటేశ్వరరావు .. డైలాగ్స్ నువ్వే రాయాలి .. వీడితో రాయిస్తే నేను ఒప్పుకోను .. నీ హ్యాండ్ రైటింగ్ తోనే డైలాగ్స్ ఉండాలి' అన్నారు. నాకు కాస్త ఇబ్బంది అనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాను.
ఆ తరువాత 'మరో కురుక్షేత్రం' సినిమా క్లైమాక్స్ ను నేను మాదాల రంగారావుకు వినిపిస్తూ ఉండగా, అక్కడికి అన్నయ్యతో కలిసి వేజెళ్ల వచ్చారు. నేను రాసిన డైలాగ్స్ విన్నారు .. మాదాల రంగారావు నన్ను మెచ్చుకుంటూ అక్కున చేర్చుకోవడం వేజెళ్ల చూశారు. 'ఏదో డిటెక్టివ్ కథలే రాస్తావనుకున్నాను .. నీలో ఇంత సామాజిక స్పృహ ఉందనుకోలేదు .. అంటూ నా రెండు చేతులూ పట్టుకుని 'సారీ' చెప్పారు.